ఇన్ఫోసిస్‌ కు ఇదే కీలకమైన ఘట్టం

SMTV Desk 2017-08-21 18:32:37  Infosys, Vishal sikka resign, New infosys CEO, Narayana Murthy

ముంబై, ఆగస్ట్ 21: ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ, ఎండీ పదవికి విశాల్‌ సిక్కా రాజీనామా చేస్తూ తనపై తప్పుడు ఆరోపణలు ఎక్కువైన కారణం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొత్త సీఈఓ అన్వేషణలో సంస్థ ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ పని అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ వ్యవస్థాపకుల నిరంతర పర్యవేక్షణ ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని, సీఈఓ పదవి చేపట్టేందుకు చాలా మంది అభ్యర్ధులు ఆసక్తి చూపక పోవచ్చని అంటున్నారు. సిక్కా రాజీనామాకు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఆరోపణలే కారణమని బోర్డు తెలిపింది. నిరంతర పర్యవేక్షణ, బాహాటంగా దూషణ ఏ సమర్ధ వ్యక్తికైనా ఇబ్బందికరమే. బయటి వ్యక్తులు ఎవరూ కూడా దీనిని సానుకూలంగా తీసుకోలేరని ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) అభిప్రాయపడింది. దీంతో సంస్థలోని వ్యక్తులనే సీఈఓ గా నియమించడం ఉత్తమం, సులభం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌కు కొత్త సీఈఓ ఎంపిక ప్రక్రియ కష్టమేనని పరిశ్రమ నిపుణుడు ప్రమోద్‌ భాసిన్‌ పేర్కొన్నారు. సంస్థకు చెందిన ప్రముఖుడు గణేశ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ సంస్థ విలువ పడిపోకుండా కార్యకలాపాలు యథాతథంగా సాగుతున్నాయని సంకేతాలు తెలిసేలా సీఈఓ నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు.