అధికారం కన్నా ప్రజాసేవే ముఖ్యం

SMTV Desk 2019-04-30 13:32:59  andhrapradesh elections 2019, janasena party, pawan kalyan

అమరావతి: ఏపీలో ఎన్నికల తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన జనసేన అప్పుడప్పుడు పార్టీ మీటింగ్ లు కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే జనసేన ఏపీ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించిందని అలాగే తమకు సైలెంట్ ఓటింగ్ వచ్చిందని..‌ అది ఎంత అనేది ఫలితాల రోజు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడలో కాకినాడ పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. పోలింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను నేతలు అభ్యర్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత మాదాసు గంగాధరం మాట్లాడుతూ...రాజ్యాధికారం చేపట్టడానికి బీఎస్పీకి 25 ఏళ్లు పడితే.. జనసేనకు మాత్రం ఐదేళ్లే పడుతోందన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉంది.. ఎవరూ ఊహించని విధంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయన్నారు. జనసైనికులు అంటే పవన్‌ కళ్యాణ్‌కు ప్రాణం.. వారు వెనుక ఉన్నారన్న నమ్మకంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఏపి ఎన్నికల తర్వాత సర్వేల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుంది.. ఈ పార్టీ విజయం సాధిస్తుందని అని చెబుతున్నారని.. తమకు సర్వేలతో పనిలేదన్నారు. జనసేన పార్టీకి ప్రజాసేవే ముఖ్యమని.. రాజ్యాధికారం అందని అనేక కులాలు, వర్గాలను అందలం ఎక్కించాలని పవన్ కృషి చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి గ్రామ గ్రామాన జనసేన జెండా రెపరెపలాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ‌కీయాల్లో కొంత‌మందికే అవ‌కాశం వ‌స్తుందన్నారు గంగాధరం. అలా వ‌చ్చిన వారు గొప్ప‌వారు కాదు.. రానివారు త‌క్కువ కాదని అభిప్రాయపడ్డారు. జ‌న‌ సైనికులు, నేతలు చిన్న చిన్న విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల్లో జనసేన మెజార్టీ స్థానాల్లో గెలిచేలా పనిచేయాలని కోరారు.