వార్నర్ ఆఖరి మ్యాచ్...జట్టు గెలుపులో కీలక పాత్ర

SMTV Desk 2019-04-30 12:40:13  ipl 2019, srh vs kxip, david warner

హైదరాబాద్: సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంత చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (81: 56 బంతుల్లో 7x4, 2x6) బాదుడికి పంజాబ్ స్పిన్నర్ ముజీబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 66 పరుగులు సమర్పించుకోగా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ని బౌలర్లు రషీద్ ఖాన్ (3/21), ఖలీల్ అహ్మద్ (3/40), సందీప్ శర్మ (2/33) చెలరేగడంతో 167/8కే హైదరాబాద్ పరిమితం చేసింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్ (79: 59 బంతుల్లో 4x4, 5x6) దూకుడుగా ఆడినా.. జట్టుని గెలిపించలేకపోయాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన వార్నర్ ఏ దశలోనూ పంజాబ్ బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. స్వీప్, రివర్స్ స్పీప్ షాట్లతో పాటు తన హుక్ షాట్లతోనూ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన పంజాబ్ బౌలర్ల.. మరింత తేలిపోయారు. మొత్తంగా.. తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 692 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, 8 అర్ధశతకాలుతో పాటు ఏకంగా 21 సిక్సర్లు, 57 ఫోర్లు ఉండటం దూకుడుకి నిదర్శనం.