అవమానం తట్టుకోలేకపోతున్నా : రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2019-04-29 16:00:15  Ram Gopal Varma,

ట్రాఫిక్ అంత‌రాయం.. శాంతి భద్రతకు విఘాతం అంటూ పోలీసులు డ్రామాలాడార‌ని.. త‌న‌కు చేత‌కాని నోటీస్‌లు ఇచ్చార‌ని సెన్సేష‌న‌ల్ కామెంట్లు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బలవంతంగా తనను విజయవాడ నుంచి పంపేయమని నోటీస్‌లో పేర్కొనలేదని హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌ర‌గిన ప్రెస్ మీట్ లో వివ‌రాల్ని వెల్ల‌డించారు. అసలు ఆ నోటీస్ ఎవరిచ్చారో కూడా తనకు తెలియద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

బెజ‌వాడ‌లో త‌న‌ని నిలువ‌రించ‌డం.. ప్రెస్ మీట్ పెట్టుకో నివ్వకపోవడం దారుణమని వర్మ ఆవేద‌న చెందారు. తానేదో టెర్రరిస్టుని అన్నట్టు ప్రవర్తించార‌ని.. విజయవాడలో ఉండటానికి కూడా అంగీకరించలేదని ఆర్జీవీ పోలీసులు- ఏపీ ప్ర‌భుత్వంపై ఓ రేంజులో ఫైర‌య్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ నాకు సెకండరీ .. జరిగిన అవమానం షాక్‌కు గురిచేసింది.. ఈ అవ‌మానం త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని ఆర్జీవీ అన్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజైంది… దీని గురించి కొత్తగా మాట్లాడటానికి విజయవాడలో ఏముంటుంద‌ని తాను ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఏం మాట్లాడతానని పోలీసులు భయపడ్డారు అంటూ నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. న‌న్ను అడ్డుకొమ్మని ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కనీసం నోటీసులోనూ దానిపై వివ‌ర‌ణ లేద‌న్నారు. విమ‌నాశ్ర‌యంలోకి పోలీసులు ఎలా వచ్చారు? అంటూ లాజిక్ ని వర్మ ప్రశ్నించారు. ప్రెస్‌మీట్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా తనకు లేదా? అని నిలదీశారు. తనను ఏపీకి రావొద్దని అంటున్నారని.. ఆంధ్రప్రదేశ్‌ ఏమైనా నార్త్‌ కొరియానా? అని ప్రశ్నించారు. వీసా తీసుకుని అక్కడ అడుగుపెట్టాలా? అని వర్మ ప్రశ్నించారు. బుధవారం (మే1న‌) ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను విడుదల చేస్తాన‌ని తెలిపారు.