బిసిసిఐని బ్లాక్‌మెయిలింగ్‌ చేసిన ఆస్ట్రేలియా!

SMTV Desk 2019-04-29 14:24:02  ipl womens 2019, Australia cricket, bcci

ముంబై: మే 6 నుంచి జరగబోయే మహిళా ఐపీఎల్ కు ఆస్ట్రేలియా తమ ఆటగాళ్ళను ఇండియాకు పంపించకుండా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. దీనిపై బీసీసీఐ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఏ)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లను ఇండియాకు పంపించాలంటే ఎఫ్‌టిపి (ఫ్యూచర్‌ టూర్‌ పోగ్రాం) వివాదం తేల్చాలని మెలిక పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పర్యటిచాల్సి ఉంది. అయితే, దీనిని వాయిదా వేయాలని భావించింది. దీనికి బిసిసిఐ ససేమిరా అనడంతో….మహిళా ఐపిఎల్‌కు తమ ఆటగాళ్లను పంపకుండా బిసిసిఐపై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తోంది. ఈమేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్‌ బిసిసిఐకి ఈమెయిల్‌ పంపారు. 2020లో భారత్‌లో ఆడాల్సిన సిరీస్‌పై ఉన్న వివాదం పరిష్కారమైతే తప్ప మహిళా ఐపిఎల్‌కు తమ ఆటగాళ్లను పంపడం సాధ్యం కాదన్నారు. సిఏ ఈమెయిల్‌పై స్పందించిన బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెన్స్‌క్రికెట్‌కు మహిళా ఐపిఎల్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించింది. బెలిందా ఈమెయిల్‌ చూస్తుంటే తమను బాక్లక్‌మెయిల్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తోందని మండిపడింది. భవిష్యత్తు పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టిఐ) ప్రకారం ఆసీస్‌తో సిరీస్‌ జరగాల్సి ఉందని, ఇప్పుడు వెనకడుగువేయడం ఏమిటని నిలదీసింది. వచ్చేనెల 6 నుంచి 11 వరకు జైపూర్‌ వేదికగా జరగనున్న మహిళల ఐపిఎల్‌లో ఆసీస్‌ మహిళా క్రికెటర్లు లానింగ్‌, ఎలిస్‌ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉండగా, వారిని భారత్‌ పంపాల్సిందిగా బిసిసిఐ కోరడంతో సిఏ ఇలా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడింది.