రోహిత్ శర్మకు జరిమానా

SMTV Desk 2019-04-29 12:51:12  kkr vs mi, ipl 2019, rohit sharma

ముంభై: ఐపీఎల్ 2019 సీజన్లో ప్రధాన ఆటగాళ్ళందరూ అంపైర్లపై అసంతృప్తి చెందుతున్నారు. అలాగే వారిపై వివాదానికి దిగి యాజమాన్యం చేత జరిమానాలు విధించుకున్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుజట్టు కెప్టన్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్ శర్మ.. పెవిలియన్‌కి వెళ్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బెయిల్స్‌ను బ్యాట్‌తో పడగొట్టాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన రోహిత్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. 233 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్ లో నాలుగో ఓవర్‌ వేసేందుకు కోల్‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ గర్నీ వచ్చాడు. ఈ ఓవర్‌లో మూడో బంతిని ఎదుర్కొన్న రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చాడు. రోహిత్‌శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు. ఆ సమీక్షలో థర్డ్‌ అంపైర్‌.. ‘అంపైర్స్‌ కాల్‌’గా ప్రకటించాడు. ఈ సమయంలో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు. అవతలి ఎండ్‌లో ఉన్న అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేస్తూ తన బ్యాటుతో వికెట్లను కొట్టాడు. దాంతో ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద హిట్ మ్యాన్ కు మ్యాచ్‌ ఫీజులో 15శాతం కోత విధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి చివరి వరకు పోరాడిన 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.