ఆసక్తికరంగా నాని 25 సినిమా లోగో

SMTV Desk 2019-04-29 12:36:52  Natural Star Nani,

హైదరాబాద్‌: ‘జెర్సీ’ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని తన తదుపరి సినిమాలో నటించేందుకు అంగీకరించారు. నాని నటించే 25 సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా లోగోను నాని ట్విటర్‌ వేదికగా సోమవారం రిలీజ్ చేశారు. ఎరుపు రంగులో ‘v’ అని రాసున్న ఈ సినిమా లోగో ఆసక్తికరంగా ఉందని నాని అభిమానులు చెబుతున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ‘మోహనకృష్ణ దర్శకత్వంలో నాని తొలి సినిమా అష్టా చమ్మా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా నాడు విజయవంతమైంది. ఈ సినిమా ద్వారానే నటుడిగా తాను వెండి తెరకు పరిచయమయ్యానని, తిరిగి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నాని తెలిపారు. తన స్నేహితుడు సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హీరో సుధీర్ బాబు కూడా ఈ సినిమా గురించి ట్విటర్ లో తెలిపారు. సినిమాలోని అన్ని ట్విస్టులలో ఇది మొదటి ట్విస్టు అని సుధీర్ బాబు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.