సోషల్ మీడియాలో RCB పై ట్రోల్ల్స్ వర్షం

SMTV Desk 2019-04-29 11:23:20  IPL 2019, RCB, RCB VS DC ROYAL CHALLENGERS BENGULORE

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి మొదటగా తొలగిపోయిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని సోషల్ మీడియాలో అభిమానులు తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ 12 మ్యాచ్‌లాడి తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి.. ఆ తర్వాత బోణి అందుకుని.. మళ్లీ ఒక మ్యాచ్‌లో ఓడి.. అనంతరం హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. అయితే ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓడిన బెంగళూరు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా.. ప్రయోజనం లేదు. ఇక నిన్నటి మ్యాచ్ లో మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (50: 37 బంతుల్లో 5x4, 2x6), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (52: 37 బంతుల్లో 2x4, 3x6) అర్ధ శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 171/7కే పరిమితమైంది. బెంగళూరు జట్టులో పార్థీవ్ పటేల్ (39: 20 బంతుల్లో 7x4, 1x6), స్టాయినిస్ (32: 24 బంతుల్లో 1x4, 2x6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (23), ఏబీ డివిలియర్స్ (17) కీలక సమయంలో ఔటవగా.. మిడిలార్డర్‌ ఆటగాళ్లు శివమ్ దూబే (24), హెన్రిచ్ క్లాసెన్ (3) తేలిపోయారు. దీంతో.. బెంగళూరుకి ఓటమి తప్పలేదు.