భారత సరిహద్దులో చైనా యుద్ధ సన్నాహాలు

SMTV Desk 2017-08-21 15:32:40  China, India, China Central Television, Global times, Military, Doklam standoff

బీజింగ్, ఆగస్ట్ 21: చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) గతవారం సైనిక యుద్ధవిన్యాసాలు నిర్వహించినట్టు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ రోజు ప్రచురించింది. ప్రత్యక్ష సైనిక యుద్ధ సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాల్లో ఆర్మీ ట్యాంకులను, హెలికాప్టర్లను ఉపయోగించినట్టు వెల్లడించింది. సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన కొండప్రాంతాల్లోని లక్ష్యాలపై సైనికులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత హెలికాప్టర్లు ఉపరితలంపై ఉన్న లక్ష్యాలపై క్షిపణులు ప్రయోగించాయని చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ (సీసీటీవీ)ను ఉటంకిస్తూ ప్రచురించిన ఈ కథనంలో తెలిపింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కు చెందిన పదికిపైగా యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ కు అత్యంత సమీపంలోని కింఘై-టిబెట్ పీఠభూమి వెస్ట్రన్ కమాండ్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం సుపరిచితమే. అయితే ఈ విన్యాసాలకు సంబంధించిన 5నిమిషాల వీడియోను అక్కడి ప్రభుత్వ అధికార చానల్ చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ వీడియో ఆధారంగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. కాగా, భారత్-చైనాల మధ్య డోక్లాం సమస్య మొదలైన తరువాత చైనా సైనిక విన్యాసాలు చేయడం ఇది రెండోసారి. ఈ సమస్య తారా స్థాయికి చేరిన తరుణంలో డ్రాగన్ దేశం సైనిక విన్యాసాలు చేయడం పలు అనుమానాలకు తావుతీస్తుంది.