10-12 రోజులలో రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌

SMTV Desk 2019-04-28 18:30:08  recounting, re verification

ఇంటర్మీడియెట్ ఫలితాలలో ఏర్పడిన గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి నివేదిక ఇచ్చింది. పది పేజీలు, 46 అనుబంద పేజీలతో కూడిన ఆ నివేదికలో ఇంటర్ పరీక్షా ఫలితాలలో అవకతవకలకు సబందించి కారణాలను, చేపట్టవలసిన దిద్దుబాటు చర్యలను, మళ్ళీ అవి పునరావృతం కాకుండా నివారించేందుకు తగిన పరిష్కారాలను పేర్కొన్నామని కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మీడియాతో మాట్లాడుతూ, “రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కోసం మొత్తం 12 సెంటర్లు ఏర్పాటు చేశాము. ఏ రోజూకారోజు చొప్పున బులిటెన్‌ విడుదల చేస్తాము. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాము,” అని తెలిపారు.

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “10-12 రోజులలో రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాము,” అని చెప్పారు.

కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ స్వయంగా గ్లోబరీనా సంస్థకు రూ.125 కోట్లకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించారు కనుకనే ఆయన ఇప్పటివరకు ఇంటర్ బోర్డు అవకతవకల గురించి నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో విద్యావంతులున్నట్లయితే తమను ప్రశ్నిస్తారనే భయంతోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం రాష్ట్రంలో విద్యావ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించేస్తోంది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం దాచిపెట్టకుండా దానిలో ఏమి ఉందో అందరికీ తెలిసేలా బహిర్గతం చేయాలి,” అని అన్నారు.