ఉపరాష్ట్రపతి తెలుగు ముఖ్యమంత్రులను ఏం కోరారు?

SMTV Desk 2017-08-21 13:38:05  Venkaiah Naidu, Vice president, KCR, Honour program, Rajbhavan Hyderabad

హైదరాబాద్, ఆగస్ట్ 21: భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నికైన తరువాత దేశం మొత్తం మీద మొదటిసారిగా ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం నేడు రాజ్‌భవన్‌లో సత్కరిస్తున్న విషయం సుపరిచితమే. ఈ పౌర సన్మాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేగా తొలిసారి 1978లో తొలిసారి హైదరాబాదు వచ్చానని, ప్రపంచ పటంలో హైదరాబాదు నగరానికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక స్థానానికి చాలా మంది కారకులు అని ఆయన స్పష్టం చేశారు. సన్మాన కార్యక్రమం తరువాత పసందైన విందు ఏర్పాటు చేస్తాను...మీరు తప్పకుండా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో అన్నారు. కానీ, కేసీఆర్ మాటలతో కడుపు నిండిపోయిందని అన్నారు. కేసీఆర్ ప్రసంగం షడ్రశోపిత భోజనం చేసినట్లు ఉందని ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి తెలంగాణ గడ్డను కొనియాడుతూ మధ్యలో తాను భాషా ప్రియుడిని, భోజన ప్రియుడిని కూడా అని ఆయన తెలిపారు. ఇక్కడి కొస్తే హైదరబాదు బిర్యానీ అని, అటు వెళ్తే నెల్లూరు చేపల పులుసు అని అంటారని ఆయన తెలిపారు. తాను పుట్టింది నెల్లూరు జిల్లా అయితే చదివింది వైజాగ్ లో, ఇక రాజకీయంగా ఎదిగింది, ఒదిగింది హైదరాబాదులోనేనని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనం తెలుగువారమేనని ఆయన పేర్కొన్నారు. మనల్ని ఇతరులెవరైనా తెలుగువారనే అంటారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా నేను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రెండు కోర్కెలు అడుగుతున్నాను. ఒకటి ఇరు రాష్ట్రాలు సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. రెండోది తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వండి అని ఆయన ప్రకటించారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు తన దృష్టిలో మానవుడే కాదన్నారు. నేను ఎక్కడ ఉన్న ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మరొక మారు తెలియచేస్తున్నానంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.