మారుతీరావుకు బెయిల్ మంజూరు

SMTV Desk 2019-04-27 14:35:47  marutirao, amruta pranay case, marutirao get bail

మిర్యాలగూడ: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరైంది. అంతేకాక ఆయనతో పాటు ఈ కేసులో ఏవన్ నిందితులుగా వున్న మరో ఇద్దరికి కూడా బెయిల్ మంజూరైంది. ఆరో నిందితుడైన మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్, ఐదో నిందితుడు కరీంలకు కూడా బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 18న వీరిపై ముందస్తు నిర్బంధం(పీడీ) చట్టం కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వారు బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.జైలుకు వెళ్లినప్పటినుంచి నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తన తండ్రికి బెయిల్ ఇవ్వొద్దని మొదటినుంచి మారుతీరావు కుమార్తె అమృత వాదిస్తోంది. అయితే వారికి బెయిల్ రాకుండా చేయాలని పోలీసులు శక్తివంతమైన కౌంటర్లు వేసి, బలమైన వాదనలు వినిపించారు. దీంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న కోర్టు శుక్రవారం వారికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కాపీలు వరంగల్ సెంట్రల్ జైలుకు చేరగానే ఆ ముగ్గురు విడుదల అవుతారు. దీనిపై మారుతీరావు కుమార్తె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే అన్నారు. కుమార్తె ప్రేమను అంగీకరించన తండ్రి మారుతీరావు కిరాయి రౌడీకి సుపారీ ఇచ్చి ప్రణయ్ హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.