సామాజిక కార్యకర్తను క్షమాపణలు కోరిన శ్రీలంక ప్రభుత్వం

SMTV Desk 2019-04-27 14:34:52  amara majeed, srilanka government say sorry to amara majeed

కొలంబో: శ్రీలంకలో గత ఆదివారం జరిగిన పేలుళ్లకు కారణమైన అనుమానితుల జాబితాలో శ్రీలంక పొరపాటున అమెరికాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఫొటోను ప్రచురించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి శ్రీలంక సర్కార్ పై ధ్వజమెత్తింది. దీంతో శ్రీలంక ఆమెకి క్షమాపణలు కోరింది. పూర్తి వివరాల ప్రకారం....శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో ఫాతిమా ఖాదీయాకి బదులుగా అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్‌ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్‌ ట్విటర్‌ వేదికగా ఈ సందర్భంగా మాట్లాడింది. ఈ ఉదయం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాల్లో నా ఫొటోను గుర్తించాను. ఈస్టర్‌ రోజున శ్రీలంకలో జరిగిన దాడులతో నాకెలాంటి సంబంధం లేదు. ఇప్పటికే మా ముస్లిం వర్గం నిఘా అధికారుల తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిందారోపణలు చేయవద్దు. ఒక సారి పున:సమీక్ష చేసుకోండి. దయచేసి ఈ మారణహోమంతో నాకు అంటగడుతూ నిందలు మోపడం ఆపండి. ఇలాంటి సమాచారాన్ని అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల అమయాకుల కుటుంబం, కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని అన్నారు. ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్‌కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ రోజు మీడియాకు విడుదల చేసిన ఆరుగురు అనుమానాస్పద ఉగ్రవాదుల విషయంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. సీఐడీ అందించిన సమాచారం మేరకు మేం ఫాతిమా ఖాదీయా అనే ఉగ్రవాది ఫొటోను ప్రచురించాం. అయితే, సీఐడీ అందించిన సమాచారం ప్రకారం ఆ ఫొటో ఫాతిమా ఖాదీయాది కాదు. అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్తది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఆమె ఫొటోను వెంటనే తొలగిస్తున్నాం. అని పేర్కొంది.