హిట్ మ్యాన్ కు మరో రికార్డ్

SMTV Desk 2019-04-27 13:21:04  ipl, mumbai indians, rohit sharma, highest half centurys in ipl

ముంభై: ఐపీఎల్ ముంభై ఇండియన్స్ జట్టు కాప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. శుక్రవారం చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ ‌ఆటతీరుతో ముంబయి జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువ సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న ఇండియన్‌ క్రికెటర్లలో రోహిత్‌ అందరికన్నా ముందున్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 17 సార్లు హిట్‌ మ్యాన్‌ ఈ అవార్డు దక్కించుకున్నాడు. యూసుఫ్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోనీ(16), సురేశ్‌ రైనా (14), గంభీర్‌ (13), విరాట్‌ కోహ్లీ, రహానె(12), సెహ్వాగ్‌(11), మిశ్రా (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మీద ఎక్కువ అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో నిలిచాడు.సీఎస్కేపై హిట్‌ మ్యాన్‌ ఏకంగా 7 అర్ధ శతకాలు బాదాడు. తర్వాతి స్థానంలో వార్నర్‌(6), ధావన్‌(6), విరాట్‌ కోహ్లీ(6), వాట్సన్‌(5), గంభీర్‌(5) ఉన్నారు. రోహిత్‌‌కు చెపాక్‌ స్టేడియం బాగా కలిసొచ్చిన లక్కీ చెపాక్ స్టేడియం అని చెప్పొచ్చు. ఈ స్టేడియంలో ఆరు మ్యాచులు ఆడాడు. రెండుసార్లు డెక్కన్‌ ఛార్జర్స్‌(2008,2010), రెండుస్లారు ముంబయి ఇండియన్స్‌ ఆటగాడిగా (2012, 2013), మరో రెండు సార్లు ముంబయి జట్టు సారథిగా(2015,2019)గా ఆడాడు. ఈ ఆరు మ్యాచుల్లో రోహిత్‌ జట్టు విజయం సాధించడం గమనార్హం. ఇదే స్టేడియంలో రోహిత్‌ తొలిసారి అర్ధ సెంచరీ చేయడం మరొక విశేషం.