శ్రీలంకలో కాల్పులు...సూసైడ్ బాంబులతో పేల్చుకున్న 15 మంది ఉగ్రవాదులు

SMTV Desk 2019-04-27 12:19:03  srilanka, firing between srilanka army ad terrorists

కొలంబో: శ్రీలంకలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు మావనబాంబులుతో తమను తాము పేల్చివేసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్న పిల్లలు ఉన్నారు. పోలీసులకు సమ్మంతురై అనే ప్రాంతంలో ముష్కరులు భారీ ఆయుధాలతో దాగి ఉన్నారని పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసుల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మృతి చెందగా పలువురు ఉగ్రవాదులు గాయాలతో తప్పించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలో దాదాపు 140 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 76మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సిరియా, ఈజిప్టు తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. శ్రీలంకలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.