‘అవెంజర్స్ ఎండ్ గేమ్' రివ్యూ

SMTV Desk 2019-04-26 18:40:33  Avengers, Avengers age of ultran, Avengers Infinity war, Avengers End game, Teaser, Anthony Russo, Joe Russo, Kevin Feige, Robert Downey Jr., Chris Hemsworth, Mark Ruffalo, Chris Evans, Scarlett Johan

హైదరాబాద్: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నహాలీవుడ్ సంచలన చిత్రం, మార్వేల్ కామిక్స్ అద్భుతం‘అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ రోజు విడుదలయ్యింది. తెలుగు ప్రేక్షకుల కోసం అనువాదం చేసి విడుదల చేశారు. థానోస్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పడం విశేషం. కిందటేడాది వచ్చిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’కు కొనసాగింపే ఈ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ‘ఇన్ఫినిటీ వార్’లో థానోస్ విధ్వంసం సృష్టించాడు. విశ్వంలోని సగం మందిని అంతం చేశాడు. అవెంజర్స్‌లో కూడా చాలా మందిని చంపేశాడు. థానోస్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకున్న మిగిలిన అవెంజర్స్ ఈ ‘ఎండ్‌గేమ్’లో మళ్లీ ఏకమవుతారు. థానోస్‌ను అంతం చేసి చనిపోయినవారందరినీ మళ్లీ బతికించాలని, పాత రోజులు తీసుకురావాలని సంకల్పిస్తారు. మరి థానోస్‌ను అవెంజర్స్ ఎలా అంతం చేశారు? చనిపోయినవారందరినీ ఎలా బతికించారు? అనేదే సినిమా. కథ: స్పేస్‌లో ఇరుక్కుపోయిన ఐరన్ మ్యాన్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను రక్షించడం, సూపర్ హీరోలు ఏకం కావడంతో సినిమా మొదలవుతుంది. సినిమా ప్రారంభంలోనే థానోస్‌ను అవెంజర్స్ అంతం చేస్తారు. కానీ, అక్కడితో అయిపోదు. అసలుసిసలైన మజా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా, సెకండాఫ్ మాత్రం దూసుకెళ్తుంది. సూపర్ హీరోల విన్యాసాలు, పోరాటాలు, గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ప్రేక్షకుడిని సీటుకు అతుక్కుపోయాలా చేయడంలో దర్శకులు ఆంటొని, జో రస్సోలు సఫలమయ్యారు. అభిమానులకు సూపర్ హీరోల పోరాటాన్ని ఆఖరిసారిగా వెండితెరపై చూపించే సినిమా కాబట్టి దర్శకులు కూడా ఆ స్థాయిలోనే తెరకెక్కించారు. ‘అవెంజర్స్’ సిరీస్‌లోనే ఇది అత్యధిక నిడివి కలిగిన సినిమా అయినా ఎక్కడా బోర్ కొట్టదు. ‘ఇన్ఫినిటీ వార్’తో పోలిస్తే ఈ సినిమాలో సూపర్ హీరోలలో ఏర్పడిన మార్పులు, వాళ్లలో కొంతమంది చేసే కామెడీ, ఎమోషన్స్, డ్రామా వినోదాన్ని పంచుతాయి. ముఖ్యంగా థోర్ పాత్ర నవ్వు తెప్పిస్తుంది. అలాగే రాకెట్ (ఫాంటసీ క్యారెక్టర్) డైలాగులు వినోదాన్ని పంచుతాయి. తెలుగు డబ్బింగ్ చాలా బాగా కుదిరింది. థానోస్‌ పాత్రకు రానా డబ్బింగ్ కరెక్ట్‌గా సరిపోయింది. సూపర్ హీరోలందరూ సినిమా మొత్తం కనిపించకపోయినా ప్రతి సూపర్ హీరో పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంది. కెప్టెన్ అమెరికా (క్రిస్ ఎవాన్స్), బ్లాక్ విడో (స్కార్లెట్ జాన్సన్), కెప్టెన్ మార్వెల్ (బ్రీ లార్సన్), ఐరన్ మ్యాన్ (రాబర్ట్ డౌనీ జూనియర్), థానోస్ (జోష్ బ్రోలిన్), థోర్ (క్రిస్ హేమ్‌స్వర్త్), హల్క్ (మార్క్ రుఫాలో), యాంట్ మ్యాన్ (పాల్ రుడ్), క్లింట్ బార్టన్ (జెరెమీ రెన్నర్) పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అయితే ఈ సినిమా కథ ముందుకు సాగడానికి ప్రధాన కారణం యాంట్ మ్యాన్ (పాల్ రూడ్). అతని వల్లే అవెంజర్స్‌కు ఒక కొత్త ఆలోచన పుడుతుంది. జరిగిపోయిన కాలంలోకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించే. ట్రెంట్ ఒపలోచ్ సినిమాటోగ్రఫీ ఓ అద్భుతం. ప్రతి సన్నివేశం చాలా అందంగా కనిపిస్తుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి అయితే మాటల్లో చెప్పలేం. సెకండాఫ్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్. 3డీకి, 2డీకి పెద్దగా తేడా ఏమీ ఉండదు. మీరు 2డీలో చూసినా విజువల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి సూపర్ హీరోస్ అభిమానులకు ఇదొక పండగలాంటి సినిమా. మార్వెల్ కామిక్స్ ఇష్టపడేవారికి అద్భుతమైన సినిమా. మూడు గంటల పాటు సాగే ఈ ‘ఎండ్ గేమ్’ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే, క్లైమాక్స్‌లో ఓ సూపర్ హీరో అభిమానులకు పెద్ద షాక్ తగులుతుంది. ఆ సూపర్ హీరో అభిమానులు బాధతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. రేటింగ్: 4/5 .