'నా ఆటను మాత్రం అవమానించకండి'....అశోక్‌ దిండా ఎమోషనల్ ట్వీట్

SMTV Desk 2019-04-26 18:35:56  ashok dinda, ashok dinda emotional tweet

న్యూఢిల్లీ: టీంఇండియా ఫాస్ట్ బౌలర్ అశోక్‌ దిండాపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనేక ట్రోల్ల్స్ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే వాటిపై స్పందించిన అశోక్‌ దిండా ట్రోల్ల్స్ చేస్తున్న వారికి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ జట్టు యాజమాన్యానికి దిండా దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. టోర్నీలో భాగంగా పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమేశ్‌ యాదవ్‌ను పొగిడే క్రమంలో ఆర్సీబీ ఆశోక్ దిండాను హేళన చేస్తూ "దిండా అకాడమియే ఏం జరిగిందంటూ?" అనే క్యాప్షన్‌ పెట్టి ఉమేశ్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆశోక్ దిండా నెలకొల్పిన కొన్ని చెత్త రికార్డలను గుర్తు చేస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. తనపై వచ్చిన ట్వీట్‌, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. "హేటర్స్‌.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి" అంటూ కామెంట్ పెట్టడంతో పాటు తాను నమోదు చేసిన గణంకాలతో కూడిన ఇమేజిని జోడించాడు. అలాగే "ఈ ప్రపంచంలో నేను అంత గొప్ప బౌలర్‌ కాదని తెలుసు. కానీ, ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే నేను క్రికెటర్‌ అయ్యేందుకు ఎంత కష్టపడ్డానో. నా క్రికెట్ కెరీర్‌కి నా కుటుంబం మద్దతు తెలపలేదు. రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ఆడుతున్నానంటే అది నా 9 ఏళ్ల కృషి" అని పేర్కొన్నాడు."ఎన్నో రోజులు క్రికెట్‌ మైదానాల్లో పడుకున్నాను. కొన్ని రోజులు తినడానికి ఆహారం ఉండేది కాదు. నాకు మద్దతివ్వడం మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి. కానీ నా ఆటను మాత్రం అవమానించకండి. ఎందుకంటే క్రికెట్‌ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు" అని దిండా ఆవేదన చెందాడు. కాగా, భారత జట్టు తరఫున 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లాడిన దిండా 12 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. గత 9 సీజన్లుగా బెంగాల్‌ రంజీ జట్టు తరఫున ఆడుతోన్న అశోక్ దిండా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 400 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆర్సీబీ సైతం దిండా విషయంలో చేసిన ట్విట్‌పై వివరణ ఇచ్చింది. "మీరు చెప్పినట్లు మేం చేసిన ఆ ట్వీట్‌ బాలేదు. మీరందరూ ఉమేశ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. అతను వాటిని సవాల్‌గా స్వీకరించి (3/36) అదరగొట్టాడు. చివరి ఓవర్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు" అని మరో ట్వీట్‌లో పేర్కొంది.