కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమానంపై విచారణ

SMTV Desk 2019-04-26 16:14:19  congress, rahul gandhi,

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) దర్యాప్తు మొదలెట్టింది. ఈరోజు ఢిల్లీ నుంచి పాట్నాకు బయల్దేరిన రాహుల్ గాంధీ... విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. అయితే ఆ విమానంలో తలెత్తిన సమస్యపై విచారణ చేపట్టింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బందితో పాటు 10 మంది విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు డీజీసీఏ ప్రకటించింది.

అదేవిధంగా తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ పాట్నాకు బయల్దేరడంతో ఆ సమస్య చోటుచేసుకుంది. దీంతో రాహుల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కొంచెం ఆలస్యంగా జరుగుతాయని రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా వివరించారు.