ఇంటర్ స్టూడెంట్స్ కి కేఏ పాల్ సందేశం

SMTV Desk 2019-04-26 15:55:15  ka paul, ka paul about ts inter students

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ రాష్ట్ర బోర్డు ఇంటర్ ఫలితాల తప్పిదాలపై స్పందించారు. అలాగే ఫలితాల వల్ల విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని, ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే తాను ముందు నిలబడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఆత్మహత్యలే సమస్యకు పరిష్కారం కాదని పాల్ అన్నారు. శ్రీలంకలో ఈస్టర్‌ రోజున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 350 మందికి పైగా చనిపోయారు. ఈ బాంబు దాడులపై కలత చెందిన తాను శ్రీలంక వెళ్లి సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు కేఏ పాల్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. బాంబు దాడులతో శ్రీలంక అతలాకుతలమైపోయిందని, అక్కడి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి తనకు తెలిసినా మూడు రోజుల నుంచి నెట్‌వర్క్ సరిగా లేనందున స్పందించడం ఆలస్యమైందన్నారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందిన ప్రాణాలు తీసుకోవద్దని, అందరికీ తప్పకుండా న్యాయం జరిగేలా తాను చూస్తానన్నారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి ఆత్మశాంతికి అందరూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.