RRకు ఊహించని విజయం

SMTV Desk 2019-04-26 12:50:57  IPL 2019, KKR VS RR

కోల్ కత్తా: గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు ఓపెనర్లు క్రిస్‌లిన్ (0), శుభమన్ గిల్ (14) పవర్‌ప్లే ముగిసేలోపే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (21), సునీల్ నరైన్ (11), ఆండ్రీ రసెల్ (14), కార్లోస్ బ్రాత్‌వైట్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దినేశ్ కార్తీక్ (97 నాటౌట్: 50 బంతుల్లో 7x4, 9x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా జట్టు 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో వరుసగా రహానె (34: 21 బంతుల్లో 5x4, 1x6), సంజు శాంసన్ (22: 15 బంతుల్లో 2x6), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (2), బెన్‌స్టోక్స్ (11), స్టువర్ట్ బిన్నీ (11) వికెట్లు చేజార్చుకున్నరాజస్థాన్ జట్టు 15.2 ఓవర్లు ముగిసే సమయానికి 123/6తో మ్యాచ్‌ని చేజార్చుకునేలా కనిపించింది. కానీ.. స్లాగ్ ఓవర్లలో భారీ సిక్సర్లు బాదిన పరాగ్, ఆర్చర్ జోడీ.. అనూహ్యంగా మ్యాచ్‌ని రాజస్థాన్‌వైపు తిప్పింది. చివరి 12 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో ఓ సిక్స్ బాదిన పరాగ్.. అనంతరం హిట్ వికెట్‌గా ఔటవగా.. సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులు ఉన్న దశలో జోప్రా ఆర్చర్ వరుసగా ఫోర్, సిక్స్ బాది రాజస్థాన్‌ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 177/7తో గెలిపించాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్‌లాడి నాలుగో విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్ చిట్టచివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.