ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భోని కొట్టిన సైనా, సింధు

SMTV Desk 2019-04-25 16:55:02  Saina Nehwal, PV sindhu, Senior badminton championship, Asia Badminton Championship

చైనా: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్‌ ,పి.వి.సింధులు చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భోని కొట్టారు. ఇక పురుషుల సింగిల్స్ లో మాత్రం అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మరోవైపు సమీర్ వర్మ తొలి రౌండ్‌లో జయకేతనం ఎగుర వేశాడు. మహిళల విభాగంలో తొలి రౌండ్‌లో సైనా 12-21 21-11 21-17 తేడాతో చైనాకు చెందిన హ్యాన్ యును ఓడించింది. తొలి గేమ్‌లో సైనాకు చుక్కెదురైనా తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించిన సైనా తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు అగ్రశ్రేణి షట్లర్ సింధు మొదటి రౌండ్‌లో 21-14, 21-7 తేడాతో జపాన్ క్రీడాకారిని సయాకా తకాషిను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన సింధు ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ అలవోక విజయాన్ని అందుకుంది. పురుషుల విభాగంలో సమీర్ వర్మ 21-13 17-21 21-18తో జపాన్ ఆటగాడు సకాయి కజునాసాను ఓడించాడు. తొలి సెట్‌లో సునాయాస విజయం సాధించిన సమీర్‌కు తర్వాతి గేమ్‌లో చుక్కెదురైంది. అయితే ఫలితాన్ని తేల్చే కీలక మూడో సెట్‌లో గెలిచిన సమీర్ ముందంజ వేశాడు. కాగా, భారత అగ్రశ్రేణి ఆటగాడు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఇండోనేషియా ఆటగాడు శేషర్ హిరన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ కంగుతిన్నాడు.