దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది

SMTV Desk 2019-04-24 19:19:50  chandrababu,vijayasai reddy

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతి విషయం మీదా స్పందించే బాబు బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేదని గతంలోనే చెప్పానని, దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేదని అన్నారు. చెన్నై నుంచి తిరుపతికి వచ్చే బంగారం జాతీయ రహదారిపై కాకుండా లోపలి రోడ్డు మీదుగా ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్నప్పుడు టీటీడీ అధికారులు ఎందుకు లేరని ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్‌ విచారణ నివేదిక బయటపెట్టాలని ఒక ప్రణాళికతో శ్రీవారి ఆస్తుల్ని దోచుకుంటున్నారని, గోవిందరాజుల కిరీటాలు ఎక్కడున్నాయో విచారణ అధికారులకు తెలుసన్నారు. చిల్లర దొంగల్ని కేసులో ఇరికించి చేతులు దులుపుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అనేక దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారని, దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది అని ఆరోపించారు. సదావర్తి భూములను ఎందుకు విక్రయించాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. టీటీడీ ప్రధాన అర్చకులను తొలగించారని, యనమల వియ్యంకుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారని, దొంగతనం, దోపిడీ చేయడానికే ఇవన్నీ చేశారనన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఐదుగురు సీఎస్ లుగా పని చేస్తే, ముగ్గురు సీఎస్ లు ఆయన పనితీరును తప్పుబట్టారని విమర్శించారు. గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమయ్యాయని, ఏ ఇంట్లో సోదా చేస్తే ఆ కిరీటాలు దొరుకుతాయో పోలీసులకు తెలుసని, అయినప్పటికీ, ఇద్దరు జేబుదొంగలను పట్టుకుని ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.