ప్ర‌భాస్‌కు తెలంగాణ హైకోర్టు ఝలక్

SMTV Desk 2019-04-24 15:46:36  High court, prabhas

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. అత‌ని ఫామ్ హౌజ్‌ను అత‌నికివ్వ‌డానికి నిరాక‌రించింది. హైద‌రాబాద్ రాయద‌ర్గం ప‌న్‌మ‌క్తా లోని పైగా భూముల్లో ప్ర‌భాస్ కు ఓ ఫామ్ హౌజ్ వున్న విష‌యం తెలిసిందే. దానిపై గ‌త నెల డిసెంబ‌ర్‌లో వివాదం చెల‌రేగింది. ప్ర‌భాస్‌కు సంబంధించిన ఓ గెస్ట్‌ హౌస్‌ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కొనుగోలు చేశార‌ని, ఇది ప్ర‌భుత్వ స్థ‌ల‌మ‌ని గుర్తించిన అధికారులు సీజ్ చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ప్ర‌భాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై వాద‌న‌లు విన్న హైకోర్టు మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర తీర్పుని వెలువ‌రించింది. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌భాస్‌ని గెస్‌హౌజ్ నుంచి ఖాళీ చేయించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని తేల్చి చెప్ప‌డంతో ప్ర‌భాస్ షాక్‌కు గుర‌య్యారు.

ప్ర‌భాస్‌ పెట్టుకున్న క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌ ద‌ర‌ఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని, అత‌ని స్థ‌లాన్ని అత‌నికి ఇవ్వ‌మ‌ని చెప్ప‌లేం అది మా ప‌రిధిని మించి చేసిన‌ట్ట‌వుతుంద‌ని జ‌స్టిస్ వి. రామ‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, జ‌స్టిస్ పి. కేశ‌వ‌రావుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. ప్ర‌భాస్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం వేసిన కేసుపై విచార‌ణ చేసిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆ స్థ‌లం వివాదంలో వుంద‌ని తేల్చేసింది. అయితే ఈ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకునే విష‌యంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని అధికారుల‌పై అక్షింత‌లు వేసింది. ప్ర‌భాస్ ఈ వివాదాన్ని క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌లో ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని, అది జ‌ర‌గ‌ని ప‌క్షంలో మ‌ళ్లీ మ‌మ్మ‌ల్ని ఆశ్ర‌యించ‌వ‌చ్చిన తేల్చి చెప్పింది.