విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టిస్తున్న 'అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌'

SMTV Desk 2019-04-24 14:54:54  Avengers end game

ప్రముఖ హాలీవుడ్‌ మూవీ అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌ భారత్‌లో చరిత్రను సృష్టించింది. ఏప్రిల్‌ 26న ఈ సినిమా ఇంగ్లీషు.. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఒక్కరోజులోనే ఈ సినిమా కోసం బుక్‌ మై షో యాప్‌లో పది లక్షల టికెట్లు అమ్ముడు పోవడం విశేషంగా చెప్పవచ్చు. అంటే ఈ లెక్కన క్షణానికి 18 టికెట్లు అమ్ముడుపోయినట్లు బుక్‌ మై షో సీఈఓ ఆశిష్‌ సక్సేనా తెలిపారు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌ మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నాం అని వివరించారు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న 22వ చిత్రం కావడంతో దీనిపై బజ్ ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

కాగా అవెంజర్స్‌ సిరీస్‌ నుంచి వస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం 500 కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబడుతుంది. ఓ హాలీవుడ్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ కు ఆంటోని రుస్సో, జో రుస్సోలు దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్‌ రుఫలో, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, స్కార్లెట్ జాన్సన్, జెరెమీ రెన్నార్, డాన్ షీడ్లే, పాల్ రూడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.