నేడు కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్

SMTV Desk 2019-04-24 14:49:13  kaleshwaram project, kaleshwaram project wet run

కాళేశ్వరం: నేడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ కు అంతా సిద్ధమయింది. మరికొద్ది సేపట్లో స్విచ్ఛాన్ చేసి భారీ మోటార్‌ను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్ఠంగా 2.66 మెగావాట్లు మొదలు 26, 40, 106.. ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న.. బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పా ట్లు వివిధదశల్లో ఉన్నాయి. నంది మేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన నీటితో నందిమేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌లో మంగళవారం రాత్రి సమయానికి 142.30 మీటర్ల మేర నింపారు. మొన్న రాత్రి మొదటి మోటరుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ ట్యూబ్ గేట్‌ను ఎత్తిన అధికారులు.. నిన్న రాత్రి రెండో మోటరు డ్రాఫ్ట్‌ ట్యూబ్ గేటును కూడా ఎత్తారు. ఇవాళ వెట్ రన్ లో భాగంగా మొదటి మోటరును ఆన్‌ చేయగానే పంపులు డిజైన్‌ స్థాయి వేగానికి అనుగుణంగా తిరుగుతున్నయా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మోటరులోని ఇంపుల్లర్‌లోకి నీటిని పంపేందుకుగాను బట్టర్‌ ఫ్లై వాల్వ్ తెరుచుకుంటుంది. దీంతో ఇంపుల్లర్ వేగంగా తిరుగడంతో అందులోకి చేరిన నీటిని ఎత్తిపోస్తుంది. ఈ నీరు 340 మీటర్ల దూరం పైపుల ద్వారా వెళ్లి, డెలివరీ మెయిన్ నుంచి టన్నెల్ బయట ఉన్న డెలివరీ సిస్టర్న్ లోకి పంపింగ్ అవుతుంది. సిస్టర్న్ ద్వారా బయటకు వచ్చిన నీరు 550 మీటర్ల పొడవుతో నిర్మించిన లీడ్ చానల్ గుండా నందిమేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ అవుతుంది. ఆ సమయంలోనే నిర్ణీత వేగం, డిజైన్‌కు అనుగుణంగా నీటి విడుదల అవుతున్నదా? ఇలా అనేక సాంకేతిక కోణాల్లో సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ వెట్ రన్ దాదాపు 20-30 నిమిషాలపాటు చేపట్టనున్నారు. రేపు మరో రెండుమోటర్లకు వెట్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి.