హైదరాబాద్ పై చెలరేగిన వాట్సన్...గెలుపు బాట పట్టిన చెన్నై

SMTV Desk 2019-04-24 11:36:24  csk vs srh, ipl 2019

చెన్నై: చేపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో చెన్నై16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఓపెనర్‌ షేన్‌వాట్సన్‌(96) మెరుపులు మెరిపించగా… సురేశ్‌రైనా(38), అంబటిరాయుడు(21), కేదార్‌ జాధవ్‌(11) లు రాణించారు. దీంతో చెన్నై జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి గెలుపొందింది. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, సందీప్‌శర్మ, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(57), మనీష్ పాండే(83)లు అర్థశతకాలతో రాణించారు. విజయ్ శంకర్(26) ఫర్వాలేదనించాడు. చెన్నై బౌలర్లలో హర్బజన్ కు రెండు వికెట్లు, దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకగా.. 10 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే.. చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన చెన్నై మళ్లీ చెపాక్ మ్యాచ్‌తో గెలుపు బాట పట్టగా.. హైదరాబాద్ వరుసగా రెండు విజయాల తర్వాత మళ్లీ ఓడిపోయింది.