ప్రజలు స్వయంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజాభివృద్ధి : వెంకయ్య

SMTV Desk 2019-04-23 17:10:05  venkayyanaidu, iiit first anniversary function

చిత్తూరు: మంగళవారం శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ....ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సరైన మార్గంలో రాజకీయాలు ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ట్రిపుల్ ఐటి ద్వార విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, 2015లో కేంద్రమంత్రి హోదాలో ఈ ట్రిపుల్ ఐటికి శంకుస్థాపన చేశానని ఆయన చెప్పారు. యూనివర్సిటీల సంఖ్య పెరగడంతో పాటు విద్యారంగంలో నాణ్యత ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో 65 శాతం మంది 35 ఏళ్ల వారే ఉండడం భారత్ బలానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే హామీలు ఇస్తున్నారని, అయితే తాత్కాలిక హామీల వల్ల సమాజాభివృద్ధి జరగదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు శాశ్వత మేలు జరిగేలా రాజకీయ నేతలు హామీలు ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజలు స్వయంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజాభివృద్ధి జరగుతుందని ఆయన స్పష్టం చేశారు.