గ్రేటర్ కలెక్టర్.....గ్రేట్ ప్లాన్

SMTV Desk 2017-08-20 12:59:56  Hyderabad Collector, Yogitarana, District Education Officer, Govt. schools, Digital class rooms, Education System

హైదరాబాద్, ఆగస్ట్ 20: అభివృద్ధి అనే పదానికి తనదైన నిర్వచనం తెలిపిన కలెక్టర్ యోగితారాణా. సుమారు మూడు సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన ఆమె ఇటీవల హైదరాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం సుపరిచితమే. అయితే ఆమె ఇక్కడ విధులలో చేరిన వెంటనే విద్యా శాఖపై దృష్టిసారించారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మీ పిల్లల చదువు పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై దృష్టిసారించాలి. ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో పని చేయండి. నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితాలు సులభంగా సాధించవచ్చు అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని రంపచోడవరం ట్రైబల్ ఏరియాలో 95 శాతం ఫలితాలు సాధించిన సంగతి గుర్తుచేశారు. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించాలని కలెక్టర్ యోగితారాణా విద్యాశాఖాధికారులకు సూచించారు. ఏ విధంగా నాణ్యమైన విద్య అందించాలో అధికారులకు అర్ధం అయ్యేలా బోధించారు. కలెక్టర్ పాఠాలను డీఈవో రమేష్ శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. కలెక్టర్ యోగితారాణా ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయాన్ని తునాతునకలు చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి సోమవారం సబ్జెక్టుల వారిగా పరీక్షలు నిర్వహించి, వారి మార్కుల ఆధారంగా విద్యార్థుల గ్రేడ్‌లను ఏ నుండి జెడ్ వరకు ఇచ్చి రిపోర్టు సిద్ధం చేయాలని ఆమె తెలిపారు. డీఈవో ఆ రిపోర్టును బుధవారం కలెక్టర్కు అందించాలి. మరో వారం పరీక్ష నిర్వహిస్తే ఇది వరకు వచ్చిన గ్రేడ్ కన్నా మెరుగ్గా ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల చదువుపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ప్రతి నెలా ఉపాధ్యాయులు ఏయే పాఠాలు బోధిస్తారో.. ఆ పూర్తి వివరాలు ప్రతి తరగతి గదిలో తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి. ప్రతీ పాఠశాలలో అన్ని మౌఖిక ఏర్పాట్లు చేయాలి. ఈ పూర్తి బాధ్యతను డీఈవో నిర్వర్తించాలని ఆమె తెలిపారు. విద్యార్థులపై పూర్తిగా శ్రద్ధ చూపితే వారు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల పనితీరుకు సంబంధించిన వివరాలు తనకు అందించాలని ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.