టర్నర్‌ ఐపీఎల్ రికార్డ్ @000

SMTV Desk 2019-04-23 13:30:16  Ashton Turner, rajastan royals, ipl 2019

జైపూర్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆసిస్ ఆటగాడు అష్టొన్ టర్నర్‌ ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ వరుసగా డకౌట్‌ అయ్యాడు. అంతకుముందు బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా సున్నాకే వెనుదిరిగాడు. ఇలా వరుసగా డకౌట్‌ అవుతూ కనీసం బౌలర్లకు కూడా అందని రికార్డు సొంతం చేసుకున్నాడీ ఆస్ట్రేలియన్‌ హార్డ్‌ హిట్టర్‌. ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. టర్నర్‌ కంటే ముందు ఐపీఎల్‌లో ఐదుగురు ఆటగాళ్లు వరుసగా మూడుసార్లు డకౌట్‌ అయ్యారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో డకౌట్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సున్నాకే పెవిలియన్‌ చేరాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాడు తీవ్రంగా నిరాశపరచడంతో క్రికెట్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా టర్నర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల్లో డకౌటైన టర్నర్‌ ఒలింపిక్‌ చిహ్నాన్ని సొంతం చేసుకున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరికొంతమందేమో నీ రికార్డు మరే చెత్త బ్యాట్స్‌మెన్‌కు కూడా సాధ్యం కాదంటూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.