ముంబై లో బాబు పర్యటన

SMTV Desk 2019-04-23 13:29:00  Mumbai, Chandrababu,

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మహారాష్ట్ర వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ముంబయిలో కాంగ్రెస్‌-ఎస్సీపీ కూటమికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాలకు మద్దతుగా ఆయన పలు రాష్ర్టాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అక్కడి తెలుగువారిని కోరేందుకు ఆయన ముంబై వెళ్లనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడినుంచి 10గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. మధ్యాహ్నం 12.30కు ముంబైలోని మంత్రాలయానికి పక్కనే ఉన్న యశ్వంతరావ్‌ చవాన్‌ సెంటర్‌కు వెళ్లి, అక్కడ తెలుగు ప్రజలు, ఇతరులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లపై చర్చించేందుకు నేడు ముంబైలో వివిధ పార్టీల ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దేశంలోని పలు పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలోని టీజేఎస్ పార్టీని కూడా చంద్రబాబు ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ చీఫ్ కోదండరాంతోపాటు పార్టీ అధికార ప్రతినిధి యోగశ్వర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు. ఇక ఆయన సాయంత్రం 4.10కి బయల్దేరి.. 5.30కు గన్నవరం చేరుకుంటారు.