ఉప్పల్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌

SMTV Desk 2019-04-23 13:08:10  IPL,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం కానుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక రెడీ కాబోతుంది. అందాల నగరం విశాఖకు కూడా అరుదైన అవకాశం దక్కింది. ప్లేఆఫ్‌లోని రెండు మ్యాచ్‌లు అక్కడ జరగనున్నాయి.

అయితే ఐపీఎల్‌లో తుది పోరు మే 12న హైదరాబాద్‌లో జరగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) చెపాక్‌లోని ఐ, జే, కే స్టాండ్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో గతేడాది రన్నరప్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌లో మ్యాచ్‌ నిర్వహించాలని ఐపీఎల్‌ నిర్వాహకులు నిర్ణయించారు. చెన్నైలో మే 7న క్వాలిఫయర్‌-1 జరుగుతుంది. ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 విశాఖలో నిర్వహిస్తారు.

అదేవిధంగా నిబంధనల ప్రకారం ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే నిర్వహించాలి. కానీ... మే 6, 10, 14న పరిషత్‌ ఎన్నికల సందర్భంగా పోలీసు బలగాలు అందుబాటులో ఉండటం లేదు. భద్రత పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో మ్యాచ్‌లను విశాఖకు తరలిస్తున్నారు. మే 8 ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 జరుగుతాయి.

కాగా మహిళలకు సంబంధించిన మ్యాచులన్నిటికీ జైపూర్‌ లో నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌ మే 6న జరుగుతుంది. ఆ రోజు పోలింగ్‌ జరుగుతుంది కాబట్టి ఆర్‌సీయే నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ట్రయల్‌ బ్లేజర్స్‌, సూపర్‌ నోవాస్‌, వెలోసిటీ జట్లు పోటీపడనున్నాయి.