రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్.. ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఢిల్లీ

SMTV Desk 2019-04-23 13:06:20  delhi, rajasthan

ఐపీఎల్ 12వ సీజన్ లో పేరు మార్చుకుని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. జైపూర్ మానసింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అజింక్యా రహానే (105 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 3×6) సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ (50 ; 32 బంతుల్లో 8×4, 0×6) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ (1/29), రబడా (2/37), అక్షర్ పటేల్ (1/39) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (54; 27 బంతుల్లో 8×4, 2×6), పృథ్వీ షా (42; 39 బంతుల్లో 4×4, 1×6) మంచి శుభారంభాన్ని అందించారు. ఇక వీరితో పాటు రిషబ్‌ పంత్‌ (78 నాటౌట్‌; 36 బంతుల్లో 6×4, 4×6) మెరుపులు తోడవ్వడంతో ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా 2009, 2012 సీజన్ల తర్వాత ఇన్నాళ్లకు ఢిల్లీ లీగ్‌ దశలో అగ్రస్థానానికి చేరింది..ఇంకో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌ చేరినట్లే. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.