ధోని మెరుపులు వృధా .. బెంగుళూరు కి వరుసగా రెండో విజయం

SMTV Desk 2019-04-22 12:47:12  Ms Dhoni, Bengaluru, rcb

చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్క పరుగుతో గెలిచింది. కెప్టెన్ ధోనీ 48 బంతుల్లో 84 పరుగులతో చెలరేగినా ఫలితం లేకపోయింది. అంబటిరాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ ధోనీకి సహకరించలేదు. దీంతో చెన్నై జట్టు చివరి బంతివరకూ పోరాడి ఒక్క పరుగుతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం కాగా ధోనీ మూడు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చెయ్యాల్సిన స్థితిలో శార్దూల్ ఠాకుర్‌ ను పార్థీవ్ పటేల్ రనౌట్‌ చేయటంతో బెంగళూరు గ్రాండ్ విక్టరీ సాధించింది.

అంతకుముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటైనా మరో ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ ధాటిగా ఆడి అర్ధశతకం సాధించాడు. డివిలియర్స్‌ 25 పరుగులు, అక్ష్‌దీప్‌ నాథ్‌ 24 పరుగులు, మార్కస్‌ స్టోయినిస్‌ 14 పరుగులు చేసి పార్థీవ్ కు సహకారం అందించారు. చివర్లో మొయిన్‌ అలీ దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరును 160 దాటించాడు. కాగా చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీయగా ఇమ్రాన్‌ తాహిర్‌ ఒక వికెట్‌ తీశాడు.

అటు హైదరాబాద్‌ వేదికగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ ఘనవిజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌ రైజర్స్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో 43 బంతుల్లో 80 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. అటు మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 38 బంతుల్లో 67 పరుగులతో చెలరేగాడు. చివర్లో వార్నర్‌ ఔటైనా, బెయిర్‌స్టో, విలియమ్సన్‌ లాంఛనాన్ని పూర్తిచేశారు. దీంతో 15 ఓవర్లలోనే సన్‌ రైజర్స్‌ సునాయసంగా విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ హాఫ్‌ సెంచరీతో ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరు సాధించింది. సునిల్‌ నరైన్‌, రింకుసింగ్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. సన్ రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్ సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టిన ఖలీల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కోల్ కతాపై అలవోకగా విజయం సాధించిన సన్ రైజర్స్ .. పతాకాల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది.