అశ్విన్ కు జరిమానా

SMTV Desk 2019-04-21 15:43:10  kxip, ipl 2019, ravichandran aswin, ipl

ఐపీఎల్ యాజమాన్యం మరో క్రికెటర్ పై వేటు వేసింది. ఈ సీజన్లో స్లో ఓవర్‌రేట్ కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువ మ్యాచ్ సమయం బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పులతో వృథా చేశాడు. దీంతో.. పంజాబ్ జట్టు నిర్దేశించిన సమయంలోపు కేటాయించిన ఓవర్లని పూర్తి చేయలేకపోవడంతో ఈ జరిమానా వేటు పడింది. ఈ సీజన్లో ఇదివరకే ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, రాజస్థాన్ రాయల్స్ (ఆ మ్యాచ్‌) కెప్టెన్ అజింక్య రహానె ఈ స్లో ఓవర్‌ రేట్ బాధితులుగా మిగిలి.. రూ. 12 లక్షలు జరిమానా చెల్లించారు. సీజన్‌లో తొలి తప్పిదానికి రూ. 12 లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి పునరావృతమయితే ఈ జరిమానా రెట్టింపుకానుంది. మ్యాచ్‌లో క్రిస్‌గేల్ (69: 37 బంతుల్లో 6x4, 5x6) మెరుపు అర్ధశతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (56: 41 బంతుల్లో 7x4, 1x6), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్: 49 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకాలు సాధించడంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.