అమ్మకాల్లో వెనుకడుగేస్తున్న హోండా

SMTV Desk 2019-04-21 15:36:21  honda, honda activa, honda scooters

ముంభై: ప్రముఖ ఆటోమొబైల్స్ తయారి సంస్థ హోండా కు చెందిన స్కూటర్ల అమ్మకాలు మార్చి నెలలో భారీగా తగ్గాయి. ఏకంగా 40 శాతం క్షీణత నమోదైంది. హోండా ప్రస్తుతం ఐదు బ్రాండ్లతో విక్రయిస్తూ అందులో యాక్టివాలోనే మూడు మోడళ్లును విడుదల చేస్తున్నాయి. అయితే వీటిలో బెస్ట్ గా సేల్ అయ్యేవి యాక్టివానే. వీటి అమ్మకాలు 1,48,241 యూనిట్లుగా నమోదయ్యి వార్షిక ప్రాతిపదికన విక్రయాలు 29 శాతం తగ్గాయి. ఇక హోండా డియో స్కూటర్ అమ్మకాలు కేవలం 6,761 యూనిట్లుగా ఉన్నాయి. ఈ స్కూటర్ విక్రయాలు ఏకంగా 79 శాతం పడిపోయాయి. గ్రాజియా అమ్మకాలు 2,262 యూనిట్లుగా నమోదయ్యాయి. 86 శాతం తగ్గాయి. ఇక హోండా ఏవియేటర్ అమ్మకాలు కేవలం 1,133 యూనిట్లే. 84 శాతం క్షీణత కనిపించింది. హోండా క్లిక్ అమ్మకాలు అయితే జీరో. స్కూటర్ విక్రయాలు భారీగా పడిపోవడంతో కంపెనీ కూడా వీటి తయారీని తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా షోరూమ్‌లలో స్కూటర్ల స్టాక్ భారీగా పేరుకుపోయింది. అందుకే తయారీని 15 నుంచి 20 శాతం తగ్గించాలని భావిస్తోంది.ఇకపోతే హోండా టూవీలర్ అమ్మకాలు తగ్గడంతో టీవీఎస్ మోటార్ రెండో అతిపెద్ద టూవీలర్ కంపెనీగా అవతరించింది. టీవీఎస్ దేశీ విక్రయాలు 2,47,710 యూనిట్లుగా ఉన్నాయి. హోండా మార్చి అమ్మకాలు 2,22,325 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా టూవీలర్ అమ్మకాలు గతేడాది మార్చిలో 4,17,380 యూనిట్లుగా ఉండటం గమనార్హం. దాదాపు 47 శాతం క్షీణత కనిపించింది. స్కూటర్ల అమ్మకాలు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది.