పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

SMTV Desk 2019-04-21 12:00:29  Delhi, Punjab, IPL

సొంతగడ్డపై వరుస ఓటములతో కూనరిల్లుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. తమ పరాజయాల పరంపరకు స్వస్తి పలుకుతూ కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి లీగ్‌లో మరింత ముందంజ వేసింది. పంజాబ్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ధవన్ 41 బంతుల్లో 56 స్కోరు చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 49 బంతుల్లో 58 స్కోర్‌ తో నాటౌట్ గా నిలిచాడు. అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.

లక్ష్యఛేదనలో ఢిల్లీకి అనుకున్న రీతిలో ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు పృథ్వీషా13, ధవన్ 56 పరుగులు తీశారు. చూడచక్కని బౌండరీలతో తొలి మూడు ఓవర్లు ఇన్నింగ్స్ సాఫీగా సాగగా, నాలుగో ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నించిన షా.. మణ్‌దీప్‌సింగ్ డైరెక్ట్ త్రోతో పెవిలియన్ వైపు భారంగా వెళ్లాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా దూకుడు ప్రదర్శించిన ధవన్.. 36 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. లక్ష్యం దిశగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో ధవన్‌ను ఔట్ చేయడం ద్వారా విల్జోయిన్ పంజాబ్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ధవన్ నిష్క్రమణతో రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ధవన్‌ను అనుసరిస్తూ ఓవర్ తేడాతో పంత్ 6 పరుగులు తీసి.. విల్జోయిన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. అయితే ఆఖర్లో ఇంగ్రామ్ 19, అక్షర్‌ పటేల్ 1 ఒక్క పరుగుతో వెంటవెంటనే ఔటైనా.. రూథర్‌ఫోర్డ్‌ తో కలిసి అయ్యర్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.