ఫస్ట్ ఇయర్ తెలుగు లో 98 మార్కులు .. సెకండ్ ఇయర్ లో సున్నా .. విద్యాశాఖ పనితీరుపై విమర్శలు

SMTV Desk 2019-04-20 18:08:52  Inter results,

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంతో ఏ తప్పూ చేయని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాగా చదివే వారు కూడా ఫెయిల్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. విచిత్రమేంటంటే మొదటి సంవత్సరంలో జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థులు కూడా సున్నా మార్కులు రావడంతో విద్యాశాఖ పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మంచిర్యాల జిల్లా చింతగూడెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి, జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. తెలుగులో ఏకంగా 98 మార్కులు సాధించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అయ్యింది. కానీ తెలుగు సబ్జెక్టులో ఆమెకు 0 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి కారణమెంటో తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. అయినా అధికారులు వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో ఒక్క మార్కు కూడా రాకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. అనుభవం లేని ఫ్యాకల్టీతో పరీక్ష పేపర్లు దిద్దిచడంతోనే ఇలా జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.