పదేళ్ళ బాలిక ఓ పాపకు జన్మనిచ్చింది

SMTV Desk 2017-08-18 17:56:05  rape attempt, 10 yeras old girl, became a mother, Chandigarh

చండీగఢ్‌, ఆగస్ట్ 18 : ఓ పాప మరో పాపకు జన్మనిచ్చింది. అమ్మ అని అమాయకంగా పిలవాల్సిన వయస్సులో అమ్మే అయ్యింది. ఈ దారుణమైన సంఘటన చండీగఢ్‌ లో చోటు చేసుకుంది. ఓ పదేళ్ళ వయసున్న బాలిక తన సొంత మామయ్య చేతిలో ఏడు నెలలుగా అత్యాచారానికి గురైంది. ఈ క్రమంలో కడుపు నొప్పితో బాధ పడుతున్న ఆ పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని తేలింది. ఆమె భవిష్యత్తును అలోచించి తన పాపకు అబార్షన్ చేయవలసిందిగా ఆ తల్లిదండ్రులు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయగా, గర్భవిచ్చిత్తికి సాధ్యమైన౦త వరకు పరిశీలించవలసిందిగా సుప్రీం కోర్టు వైద్యులను ఆదేశించింది. 32 వారాల గర్భాన్ని తొలగిస్తే ఆ పాప ప్రాణాలకే ప్రమాద౦ అని వైద్యులు తెలియజేస్తూ కోర్టుకు నివేదికను పంపించారు. దీంతో కోర్టు ఈ అభ్యర్ధనను నిరాకరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నెలలు నిండకుండానే ఆ పాప మరో పాపకు జన్మనిచ్చింది. శిశువును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసి వీరిద్దరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పాప 2.5 కేజీలు ఉన్నట్లు, ప్రస్తుతం తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా... పుట్టబోయే శిశువును సాకమని ఆ తల్లిదండ్రులు ముందే స్పష్టం చేసారు. కనీసం ఆ పాపను చూసేందుకు కూడా వారు ఇష్టపడలేదు. ఆ పాపను ఎవరైనా దత్తత తీసుకునేంత వరకు సంరక్షణ బాధ్యతను శిశు సంరక్షణ కమిటీకి అప్పగించనున్నట్లు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే ఆ పాప గర్భవతి అన్న విషయం కూడా ఆమెకు తెలియదు. కడుపులో రాయి ఉందని, డాక్టర్లు తీసేస్తారని తెలిపారట ఆ తల్లిదండ్రులు.