డయల్ 112.. వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్

SMTV Desk 2019-04-20 13:03:46  dial 112, emergency number

గతంలో అత్యవసర సేవలకు కోసం వివిధ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండగా, తాజాగా ఈ సేవలన్నిటీకి కలిపి ఒకే నంబరు అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సాయం కోసం ఒక్కో నంబరు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు అత్యవసర సేవలను ఉపయోగించుకోవడం కష్టంగా ఉందని ఆలోచించిన ప్రభుత్వం ఇప్పుడు 112ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా తక్షణమే సాయం పొందవచ్చు. ఈ సరికొత్త హెల్ప్‌లైన్ నంబరు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాలు సహా మొత్తం 20 రాష్ట్రాలకు ఈ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే తాజాగా ఇప్పుడు మరొకొన్ని రాష్ట్రాలలో ఈ సర్వీసులను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యు, జమ్ముకశ్మీర్‌, నాగాలాండ్‌ లలో ఈ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే 112 నంబరుకు ఫోన్ చేస్తే అది వారికి దగ్గరలోని నెట్‌వర్క్‌ టవర్‌ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)కి అనుసంధానం అవుతుంది. మీ సమస్యను నోట్ చేసుకుని అందుకు తగ్గ సహాయాన్ని వెంటనే అందిస్తారు.