ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన

SMTV Desk 2019-04-20 10:32:45  rain,

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కిస్మత్ పూర్, రాజేంద్రనగర్ లో వడగళ్ల వాన పడింది. అత్తాపూర్‌, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హస్తినాపురం, హయత్‌నగర్‌, అంబర్ పేట్, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, కాంచన్‌బాగ్‌, చంపాపేట్‌, ఉప్పుగూడ, లాల్‌దర్వాజలో వర్షం పడింది.

సిద్ధిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కోహెడ, ములుగు, జగదేవ్‌పూర్‌ మండలాల్లో వడగండ్ల వాన పడింది. మర్కూక్‌ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో భారీ వర్షం కురిసింది. బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గుగ్గిల్లలో వడగండ్లు పడ్డాయి. అటు సంగారెడ్డి పట్టణంలో వర్షం పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, మాదాపురం, ముల్కలపల్లిలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్ల వానకు మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. చౌటుప్పల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురిసింది. ఇల్లంతకుంట, బోయిన్‌ పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. అటు వేములవాడలోనూ వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. గన్నేరువరం మండలంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్‌ పట్టణంతో పాటు తిమ్మాపూర్‌ మండలంలో వాన పడింది. జగిత్యాల రూరల్ మండలంలోని పలుగ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి చెట్లు నేల కూలాయి. పలు దుకాణాలు, ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలుగ్రామాల్లో వడగండ్ల వాన పడింది.