శివసేన లోకి కాంగ్రెస్ పార్టీ నేత

SMTV Desk 2019-04-20 10:23:41  Shiv sena, Congress, priyanka chaturvedi,

ముంబై : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనకు జై కొట్టారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వచ్చిన తాను.. ఆ పార్టీని ఎందుకు వీడానో ఆ తర్వాత ఆమె వివరించారు. కాంగ్రెస్ పార్టీలో గూండాలకే ప్రాధాన్యమిస్తున్నారని.. తమ రక్తాన్ని, చెమటను ధారపోసి శ్రమిస్తున్న వారికి పార్టీలో స్థానం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

గతేడాది సెప్టంబర్‌లో మధురలో తాను ప్రెస్ మీట్‌లో పాల్గొని రాఫేల్‌ డీల్‌ గురించి మాట్లాడుతుండగా.. తన పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వారిపై పార్టీ అధిష్టానం అప్పట్లో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వాటిని ఎత్తివేశారని ప్రియాంక మండిపడ్డారు. వారికి కనీస శిక్ష కూడా పడకపోవడం కూడా తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు.

తన రాజీనామా లేఖను ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా పంపి 24 గంటలు గడవకముందే.. శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తనను పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించగానే.. అందుకు అంగీకరించానంటూ.. ఆయనకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు.