తైవాన్‌లో భారీ భూకంపం

SMTV Desk 2019-04-18 18:35:48  Taiwan earthquake, earthquake strikes in Taiwan

తైవాన్‌: తైవాన్ లో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ భూకంపం సంభవించింది అని వాతావరణ కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు వెల్లడించింది. హుఆలిన్ నగర తూర్పు తీరానికి వాయువ్య దిశలో 10కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.తైవాన్ రాజధాని తైపేలో భూకంపం ధాటికి భవంతులు కదిలాయి. అంతేకాదు భూకంపం ధాటికి కొన్నిచోట్ల కొండచరియలు విరిగి పడినట్లు వీడియోల్లో కనిపించింది. భూకంపం తీవ్రతతో నివాస గృహాల్లో, కార్యాలయాల్లో ఫర్నీచర్ ధ్వసమైందని తైవాన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో ఉన్న తైవాన్ భూకంపాలకు కేంద్రబిందువుగా ఉంటోంది. ఈ ప్రాంతాన్ని రిమ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. తరుచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో సంభవించిన భూకంపంలో దాదాపు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో హుఆలియన్‌ నగరంలో సంభవించిన భూకంపంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.