బలూచిస్థాన్‌లో దుండగుల చేతిలో 14 మంది ప్రయాణికులు హతం

SMTV Desk 2019-04-18 16:28:22  baluchisthan, pakistan,balochistan, gunmen attack bus in balochistan

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌లో గురువారం దుండగులు 14 మందిని హత్య చేశారు. పూర్తి వివరాల ప్రకారం...కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సులను 12 దుండగులు ఆపారు. ఆ తర్వాత ప్రతి ప్రయాణికుడిని గుర్తింపు కార్డు అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈక్రమంలో నాన్‌ – బలూచ్‌ ప్రయాణికులను కిందకు దించి 14 మందిని హత్య చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది బలూచిస్థాన్‌ వేర్పాటువాదులే కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 12 మంది.. మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నౌకదళ అధికారులు, తీర ప్రాంత సిబ్బంది లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులతో పాటు వేర్పాటువాదులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం హతులైన 14 మంది మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.