నయీం ఆస్తుల లెక్క తేల్చిన సిట్.

SMTV Desk 2019-04-18 15:52:59  nayeem, SIT,

సుమారు మూడేళ్ళ క్రితం పోలీస్ ఎంకౌంటరులో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఎట్టకేలకు అతను అక్రమంగా పోగేసిన ఆస్తుల విలువను లెక్కకట్టి చెప్పింది. అతని ఆస్తుల విలువ మొత్తం రూ.2,000 కోట్లు అని లెక్క తేల్చింది. అతనికి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ముంబై, గోవా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కూడా విలువైన ఆస్తులున్నాయని సిట్ బృందం కనుగొంది.

హైదరాబాద్‌లోని ఆల్కపురి కాలనీ, మణికొండలో పంచవటి కాలనీ, పుష్పలగూడ, షాద్ నగర్, తుక్కుగూడ, నాగోల్, సరూర్ నగర్, నార్సింగి, కల్వకుర్తి, మేడ్చల్, శామీర్ పేట, మొయినాబాద్, కరీంనగర్‌లోని నాగునూర్, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, యాదగిరిగుట్ట, గోవా, ముంబై, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రాయ్ పూర్ లో నయీమ్ కు వందల కోట్లు విలువైన వ్యవసాయ భూములు, ఇళ్ళు, షాపింగ్ కాంప్లెక్సులు, అపార్టుమెంటులు, విల్లాలు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. నయీమ్, అతని భార్య, బందువులు, అనుచరుల పేరిట మొత్తం 1,019 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ఇళ్ళు, సుమారు 2 కేజీల బంగారం, రూ.2 కోట్లు నగదు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది.

నయీమ్ పేరిట ఉన్న ఆస్తులలో కొన్ని ఇప్పటికే కొన్ని చేతులు మారగా మరికొన్ని న్యాయస్థానంలో ఉన్నాయి. ఇవి కాక ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు సిట్ బృందం న్యాయనిపుణుల సహాయం తీసుకొంటోంది.

నయీమ్ ఎంకౌంటర్ తరువాత అనేకమంది భాదితులు పోలీసుల ముందుకు వచ్చి అతనిపై పిర్యాదులు చేశారు. ఆవిధంగా మొత్తం 251 కేసులు నమోదైనట్లు సిట్ బృందం తెలియజేసింది. వాటిలో 119 కేసులలో దర్యాప్తు పూర్తి చేశామని, మిగిలిన 60 కేసుల దర్యాప్తు కూడా మరో 2 నెలలలో పూర్తి చేస్తామని సిట్ బృందం తెలిపింది.