కేజీఎఫ్‌ ఫేం యశ్‌కు కర్ణాటక సీఎం పరోక్ష బెదిరింపులు

SMTV Desk 2019-04-17 15:35:08  kgf hero, yash, sumalatha, kumaraswamy, nikhil gowda

బెంగళూరు, ఏప్రిల్ 17: కన్నడ స్టార్‌, సంచలన చిత్రం కేజీఎఫ్‌ హీరో యశ్‌పై ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పరోక్ష బెదిరింపులకు దిగారు. తన కొడుకు నిఖిల్‌ గౌడ్‌ పోటీ చేస్తున్న మాండ్య నియోజకవర్గంలో ప్రత్యర్థి సుమలతకు మద్దతుగా యశ్‌ ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

"మాలాంటి నిర్మాతవల్లే ఇటువంటి హీరోలకు జీవితం. కానీ ఇకపై ఇటువంటి వారితో సినిమాలు తీసేందుకు నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకులేదు" అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. మాండ్య నుంచి దివంగత అంబరీష్‌ సతీమణి, సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సుమలత నామినేషన్‌ వేసేందుకు వెళ్లినప్పుడు జరిగిన ర్యాలీలో యశ్‌ కూడా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. యశ్‌లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు, కానీ నా వల్లే కార్యకర్తలు మౌనంగా ఉన్నారని హెచ్చరించారు. వెండి తెరపై చూపించే ప్రతి విషయాన్ని నమ్మవద్దని, నిజ జీవితంలో చూసిన సంఘటనలనే గుర్తించాలని కోరారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ నటులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.