వేలూరు పోలింగ్ రద్దు

SMTV Desk 2019-04-17 15:28:54  polling , veluru

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజక వర్గంలో ఈ మధ్య భారీగా నగదు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్‌ 14న ఈసీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించి ఈరోజు రాష్ట్రపతి అంగీకరించడంతో అక్కడ ఎన్నిక రద్దైంది. అయితే ఈ మధ్య వెల్లూరులో ఈసీ, ఐటీ నిర్వహించిన తనిఖీల్లో స్థానిక డీఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదును గుర్తించారు.

కాగా వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ వద్ద దాదాపు రూ.11కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా.. ఆనంద్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన నేరం కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులోని 39 స్థానాల్లో ఏప్రిల్‌ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వేలూరు ఎన్నిక రద్దు కావడంతో అక్కడ 38 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.