ఇండియన్ స్టాక్ మార్కెట్ : నిఫ్టీ రికార్డ్

SMTV Desk 2019-04-16 18:08:11  Stack market, Sen sex, Shares

న్యూఢిల్లీ: మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో తేలాయి. అంతేకాక ఎప్పుడూ లేని విధంగా నిఫ్టీ తొలిసారిగా 11,800 మార్క్‌ను అధిగమించింది. సెన్సెక్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అయితే నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్స్‌లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో నిలదొక్కుకోలేక చివరకు సెన్సెక్స్ 370 పాయింట్లు లాభపడి 39,276 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్‌టీ వంటి షేర్లు ర్యాలీ చేయడంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 39,364 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టానికి, నిఫ్టీ 11,811 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని చేరాయి. కంపెనీల క్యూ4 ఎర్నింగ్స్ అదిరిపోవడం, ఈ ఏడాదిలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతోపాటు సాంకేతిక అంశాలు మద్దతుతో ఇంట్రాడేలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. అయితే చివర్లో కొంత అమ్మకాల కారణంగా లాభాలు తగ్గాయి. అదేసమయంలో విప్రో, సిప్లా, గెయిల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. విప్రో 2 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.4 శాతం పెరుగుదలతో 30,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేశాయి.