చంద్రబాబు పై మండిపడ్డ జగన్

SMTV Desk 2019-04-16 17:26:04  Jagan, Chandrababu

ఆంధ్ర ప్రదేశ్‌ లో పోలింగ్ తర్వాత జరుగుతోన్న పరిణామాల మీద గవర్నర్ నరసింహన్‌ కు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తో భేటీ అయిన జగన్ పోలింగ్‌ ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని జగన్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇనుమెట్లలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన కోడెల అధికారులు ఉండగానే తలుపులు బిగించుకున్నారని విమర్శించారు. దీనిపై ఆధారాలు రికార్డెడుగా ఉన్నాయని, అక్కడ సాధారణ ఓటర్లు కోడెల వైఖరిని ప్రశ్నిస్తే, తనంతటతానుగా బట్టలు చింపుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు తనకు నచ్చిన పోలీస్ అధికారులు, తమ కులం వారికి పదోన్నతలు ఇచ్చారని, దాని ఫలితంగానే ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందనన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని తాము కోరినట్టు జగన్ వివరించారు. అలాగే సెక్రటేరియేట్ లో చీఫ్ సెక్రటరీకి ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వాలని చంద్రబాబును అక్కడికి అనుమతించవద్దని పేర్కొన్నారు. తాను చేసిన స్కామ్స్ మీద, తను అధికారం కోల్పోయిన తరువాత, ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు గారు ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబునాయుడు సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తూ, తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ ని కోరడం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని ఈవీఎంలలో లోపాలుంటే, దాదాపు 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ప్రశ్నించారు.