రాష్ట్రంలో మరోసారి భూముల సర్వే!!!

SMTV Desk 2019-04-16 15:28:54  telangana state government, telaganga state fields survey

హైదరాబాద్: రాష్ట్రంలో జూన్‌ నుంచి కొత్త చట్టం అమలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని లెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల వివరాలతో పాటు వాటి అసలు యజమానులు ఎవరన్నది నిర్ధారించి వారికి హక్కులు కల్పించాలని సిఎం ఆలోచనగా తెలుస్తోంది. దీనికోసం మరోసారి భూములను సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ కొత్త చట్టంలో భాగంగా కంక్లూజివ్ యాక్ట్‌ను అమలు చేయాలని కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అధికారులు దీనిపై నివేదిక కూడా తయారు చేసినట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో నివేదికను సిఎం కెసిఆర్‌కు అందచేయాలని అధికారులు భావిస్తున్నారు. నిపుణులు, న్యాయ నిపుణులతో దీనిపై వర్క్‌షాపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) విధానంలో మార్పులు, పహాణీలో అక్కరలేని, నిబంధనలను తొలగించడంతో పాటు ప్రతి అంగుళం భూమికి అసలు యజమానులు ఎవరో నిర్ధారించి వాటిపై భూ హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యుటేషన్లు, ఆర్‌ఓఆర్, పహాణీల్లో మార్పులు ఆటోమెటిక్‌గా అమలయ్యేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.