డ్రైవింగ్ లో టిక్ టాక్ వీడియో తీస్తుండగా పేలిన నాటు తుపాకి...యువకుడు మృతి

SMTV Desk 2019-04-16 14:56:14  tik tok, tik tok viedos, man died while tik tok video shooting

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో చేస్తుండగా తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాల ప్రకారం...ఢిల్లీలోని న్యుజఫారాబాద్‌కు చెందిన 19 ఏళ్ల సల్మాన్ ఆదివారం రాత్రి స్నేహితులు సోహెల్, అమిర్‌లతో కలిసి కారులో ఇండియా గేట్ వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోహిల్ కారు డ్రైవ్ చేస్తుండగా సల్మాన్ అతని పక్కనే కూర్చున్నాడు. సోహిల్ కారు డ్రైవ్ చేస్తూ.. తన వెంట తెచ్చిన నాటు తుపాకి బయటకు తీశాడు. టిక్ టాక్ వీడియో చేద్దామంటూ సల్మాన్ నెత్తిన గురిపెట్టాడు. ఇంతలో అది ప్రమాదవశాత్తు పేలి సల్మాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ దగ్గరకు వెళ్లగానే బారాకంబ్ రోడ్డుమీద ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే సోహిల్.. అక్కడకు దగ్గర్లో ఉన్న దర్యాగంజ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ రక్తంతో తడిసిన దుస్తుల్ని మార్చుకున్నాడు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి సల్మాన్‌ను తీసుకెళ్లారు. అయితే అప్పటికే సల్మాన్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోహిల్, అమిర్‌తో పాటు… సోహిల్ బంధువులు షరీఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకి ఎందుకు తీసుకెళ్లారు? ఇది ప్రమాదామా లేక ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ బాడీని పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు.